DIABETES DIET

మధుమేహుల ఆహారం
మధుమేహం లేని వ్యక్తి హానికారక పదార్ధాలు తీసుకుంటే వాటి దుష్ప్రభావం కొంత ఆలస్యంగా కనిపిస్తుంది. మధుమేహుల్లో అది వేంటనే కనిపిస్తుంది. ఇదొక్కటే తేడా. మధుమేహులకంటూ ప్రత్యేకంగా చెప్పినా ఈ నియమాలు అందరూ పాటించవలసినవే.
ఎన్నిసార్లు భోంచేయాలి?
భోజనానికీ భోజనానికీ మధ్య ఎక్కువ వ్యవధి ఉండకూడదు. ఎక్కువ గంటలు గడిచే కొద్దీ రక్తంలో చక్కెర శాతం పూర్తిగా తగ్గిపోయి భోజనం చేయగానే హఠాత్తుగా పెరిగిపోతుంది. అందుకే భోజనాన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు వేళలకు విభజించడం అవసరం. వీటికి తోడు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 5 గంటలకు అల్పాహారం తీసుకోవడం కూడా అవసరం. దీని వల్ల చక్కెర శాతంలో హెచ్చుతగ్గులు లేకుండా నియంత్రణలో ఉంటాయి. 

కార్బోహైడ్రేట్లు 
ఇతరుల్లాగే మధుమేహులకు సైతం అన్ని రకాల ఆహార పదార్ధాల అవసరం ఉంటుంది. కాకపోతే, మధుమేహం ఉన్నవారు త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాల (కార్బోహైడ్రేట్లు) తీసుకోకూడదు. అలా తీసుకుంటే చక్కెర శాతం చాలా వేగంగా పెరుగుతుంది. ఇన్సులిన్ లోపాలు ఉండడం లేదా అది సక్రమంగా పనిచేయకపోవడమే అందుకు కారణం. అందుకే చక్కెర, స్వీట్లు, పళ్లరసాలు, అరటి పళ్లు, మామిడి, ద్రాక్ష, శీతల పానీయాలు, చాక్లెట్లు, బియ్యం వంటి వాటిని అతి తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

బియ్యంలో అన్నిటికన్నా అతిత్వరగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మధుమేహులకు ఇవి విషతుల్యమని కాదు. కానీ, అపరిమితంగా తీసుకోవడం వల్ల చక్కెర శాతం విపరీతంగా పెరుగుతుంది. గోధుమ మొక్కజొన్న వంటి తృణధాన్యాలు, కూరగాయలు లేదా పళ్లల్లోనూ కావలసినన్ని కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. మొలకెత్తిన ధాన్యాలు, కూరగాయలు లేదా పళ్లల్లోనూ కావలసినన్ని కార్బోహైడ్రేట్లు లభిస్తాయి.
ప్రొటీన్లు
అందరిలాగే మధుమేహులకు కూడా ప్రొటీన్లు అవసరం. శరీరంలోని ధాతువుల నిర్మాణంలో వీటి అవసరం చాలా ఎక్కువ. తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిక్కుడు ధాన్యాలు కొన్ని కూరగాయల్లోనూ కావలసిన మేరకు ప్రొటీన్లు లభిస్తాయి. వీటితో పాటా పాలు, పెరుగు, సోయాపదార్ధాలు, తక్కువ కొవ్వు పదార్ధాలు ఉండే పనీర్, వెన్న తీసుకోవడం అవసరం. మాంసాహారాన్ని బాగా ఇష్టపడేవారు బీఫ్, పోర్క్ తీసుకోకూడదు. అలాగే లివర్, కిడ్నీ, మెదడు వంటి భాగాలను కూడా తీసుకోకూడదు.

ఫ్యాట్స్
తృణ ధాన్యాలు, కూరగాయలు, పళ్లల్లోనూ కొవ్వుపదార్ధాలు ఉంటాయి. బాదం వంటి డ్రైప్రూట్స్‌లో కొవ్వు పదార్ధాలు మరీ ఎక్కువగా ఉంటాయి. నూనె పదార్ధాలు, మేక మాంసం వంటివి మానేస్తే వీటిని నియంత్రణలో ఉంచవచ్చు నిరంతరం ఒకే నూనె కాకుండా పల్లి, సోయా నూనెలు కూడా వాడాలి. పచ్చళ్లు, కొబ్బెర, మసాల వంటివి పూర్తిగా మానుకోవడమే మంచిది.

విటమిన్లు లవణాలు
ఆహారంలో తృణధాన్యాలు, కూరగాయలు, పళ్లు, పాలు ఉత్పత్తులు సరిపడా తీసుకుంటే విటమిన్లు, లవణాలన్నీ వాటి ద్వారానే లభిస్తాయి. ఆకుకూరలు, సలాడ్లు తరచూ తీసుకుంటే అన్ని పోషకాలూ లభిస్తుంది. 

పీచు పదార్ధాలు(పైబర్)
ఆహారంలో పీచుపదార్ధాలు ఉంటే రక్తంలో కలిసే చక్కెర, కొవ్వు పదార్ధాల శాతం తగ్గుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. ఆకుకూరలు, సజ్జ, జొన్న, రాగుల్లో పీచుపదార్ధాలు అధికంగా ఉంటాయి. ఎక్కువ పీచుపదార్ధాలు, తక్కుక క్యాలరీలు ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.


పీచుపదార్ధాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకున్నా చక్కెర నియంత్రణలోనే ఉంటుంది. నల్ల ద్రాక్ష పళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇవి అవసరం. ఆహార జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నామని వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం ద్వారా తీసుకున్న క్యాలరీలు ఖర్చు కావడానికి ప్రతి రోజూ అరగంట నుంచి గంటవరకు వాకింగ్ చేయడం అవసరం.