పగటిపూటనిద్ర లాభాలు,Day time Sleep benefits.

CHANNEL HYDERABAD

పగటిపూటనిద్ర లాభాలు,Day time Sleep and benefits.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మధ్యాహ్నం అలా కునుకు తీయడం మీకో అలవాటా? హాయిగా ఓ గంటపాటు మిట్టమధ్యాహ్నం నిద్దరోతున్నారా? అయితే మీ ఆరోగ్యానికేం ఢోకా లేదంటున్నారు హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు. ఇకపై మీ వారు మధ్యాహ్నం ఆ మొద్దునిద్దరేమిటని అడిగితే అదో హెల్త్‌ సీక్రెట్‌ అని చెప్పండిక.

ఆరోగ్యంగా ఉండాలంటే కాసేపు కునుకు తీయడమే...! పగలు కొంతసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు నిపుణులు...! కొందరు కాసేపు కునుకు తీసుకుంటాను. అని అంటూనే నిద్రలోకి జారుకుంటుంటారు. ఇలా ఎక్కడపడితే అక్కడ కునుకు తీయడం కొందరికి అలవాటే. ఈ అలవాటే వారిని ఆరోగ్యవంతులుగా మారుస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు..

మనలో చాలామంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గానీ తీరిక దొరికినప్పుడు గానీ కొద్దిసేపు కునుకు తీయటం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కాసేపు నిద్రపోవటం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్ల మోతాదులు తగ్గుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

అప్పుడప్పుడు నిద్రపోవడం వల్ల మెదడుకు విశ్రాంతి చేకూరుతుంది. దీంతో శరీరం పునరుత్తేజితమవుతుంది. పైగా ఇలా కునుకు తీసుకునే వారికి మానసికపరమైన ఒత్తిడి, శారీరకపరమైన ఒత్తిడి దరిచేరవంటున్నారు పరిశోధకులు.

ఇలా కునుకు తీసేవారి జాబితాలో ప్రముఖులెందరో వున్నారు. వారిలో కొందరి పేర్లు మీకోసం... ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, థామస్ ఎడిసన్, రోనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్, హెచ్‌డి. దేవెగౌడ తదితర ప్రముఖులున్నారు. కాబట్టి సమయం, సందర్భం అనుకోకుండా మీరు అప్పుడప్పుడు చిన్న కునుకు తీస్తుంటే ఆరోగ్యంగా ఉంటారని పరిశోధకులు చెపుతున్నారు.

మొదడు చురుగ్గా పనిచేసేందుకు..!

కాసేపు పడుకుని లేవడం వల్ల శరీరానికి అలసట తీరి మరింత సమర్థవంతంగా, సృజనాత్మకతతో పని చేయవచ్చట. పగలు కాసేపు పడుకోవడం టైమ్‌ వేస్ట్‌ చేయడమనుకుంటే పొరపాటే. కళ్లకు కాసింత విశ్రాంతి ఇచ్చేందుకు మంచి మార్గం ఇది. మొదడు చురుగ్గా పనిచేసేందుకు పగలు కాస్త కునుకు తీస్తే మంచిది.

రిలాక్స్‌ అయ్యేందుకు

గుండె పనితీరు మెరుగయ్యేందుకు, హార్మోన్‌ల హెచ్చుతగ్గులను సమం చేసేందుకు, రక్తనాళాలు శుభ్రపరిచేందుకు పగటి నిద్ర ఉపకరిస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే ఒత్తిడిని దీని ద్వారా తగ్గించుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో 20-30 నిమిషాలు నిద్రపోవడం వల్ల ఆ తరువాత చేసే పనిలో ఉత్సాహం నిండు తుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మగవారితో పోలిస్తే ఆడవారిలో మధ్యాహ్నం నిద్రవల్ల కలిగే లాభాలు కాస్త తక్కువే.

మంచి డైట్‌ పాటించేవారిలో దీని ప్రభావం ఎక్కువగా వుంటుంది. పండ్లు, కూరగాయలు, బీన్స్‌, ఆలివ్‌ ఆయిల్‌, కొద్దిపాటి రెడ్‌వైన్‌ తీసు కునే వారిని, సాధారణ డైట్‌తో మధ్యాహ్నం నిదురపోయే వారిని పరీక్షించగా వచ్చిన ఫలితాలు ఆశ్చర్యకరంగా వున్నాయి. పగటి నిద్ర పోయేవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం డైట్‌ పాటించేవారికన్నా తక్కువగా వుంది. వారానికి కనీసం మూడురోజులు అరగంట సేపు పగలు నిదురపోయేవారిలో గుండెజబ్బులతో మరణించే అవకాశం మామూలుకంటే 37% తక్కువ.

తిండివల్ల కాదు మధ్యాహ్నం భోజనం మితిమీరి తినడం వల్ల నిద్రముంచుకొస్తుందని అనుకుంటారు చాలా మంది. కానీ ఇది నిజం కాదని తేల్చారు శాస్త్రవేత్తలు. భోజనం చేయకున్నా మధ్యాహ్నం నిద్రవల్ల కలిగే లాభాల్లో ఎలాంటి మార్పూ ఉండదని తేల్చి చెప్పారు. పైగా దీనివల్ల అలర్ట్‌గా వుండే శక్తి, ప్రొడక్టివిటీ పెరుగుతుందట కూడా.

నిర్ణయాత్మక శక్తి

క్లిష్ట విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసు కునే శక్తి పెరిగేందుకు పగలు నిద్ర ఉపకరిస్తుంది. మెదడుకు రిఫ్రెష్‌నెస్‌ను కలిగించేది ఇదే. పగలు కాస్త కునుకు తీసి తరువాత ఏదైనా పనిని మొదలు పెడితే అది మరింత సమర్థవంతంగా వుంటుంది.

ఒత్తిడి మాయం

మనిషి పుట్టడం, చావడం మధ్యలో బ్రతకడం అంతా ఒత్తిడితోనే. ఈ ఒత్తిడి అనేది కొందరిలో ఎక్కువ పరిమాణంలో కొందరిలో తక్కువగానూ ఉండవచ్చు. ఒత్తిడిని తగ్గించుకుంటేనే ఆయు ర్దాయం పెరుగుతుందనేది వాస్తవం. ఈ ఒత్తిడిని మాయం చేసే మార్గం కాసేపు కన్నులు మూసు కుని ప్రశాంతంగా నిద్రపోవడమే.

అందానికీ మందు

అలసటను తీర్చే నిద్రవల్ల ముఖంలో కాంతి పెరుగుతుందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖంలోని రక్త కణాలు నిద్రించే సమయంలో యాక్టివ్‌గా పనిచేయడమే ఇందుకు కారణం. సహజమైన వర్ఛస్సుకు తేలికైన మార్గం కదూ! తెలిసిందిగా పగలు పదినిమిషాలు ప్రశాంతంగా నిద్రపోగలిగితే ఎన్ని ఉపయోగాలో. ఆరోగ్యం, అందం, విశ్రాంతి అన్నీ ఒక్కసారిగా దొరుకు తాయన్నమాట. మనమూ ఓ కునుకులాగిద్దామా!

అతినిద్ర

నాక్రొలెప్సీ సమస్య ఉన్నవారు అతినిద్ర జబ్బుతో ఉంటారు. చదువు తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు కునుకు తీస్తుంటారు. పదివేల మందిలో నలుగురికి ఈ సమస్య ఉంటుంది. 15 నుంచి 20 ఏళ్ల వయసు వారిలో ఈ సమస్య అధికం. నడుస్తున్నప్పుడు ఉన్నట్టుండి పడిపోతారు. నడుస్తూ కలలుకంటారు. పరిసరాలను పట్టించుకోరు. ఏంచేస్తున్నారో మరచిపోతారు.